Saturday, January 22, 2022
Home రాష్ట్రం నిరుద్యోగి ఆత్మ‌హ‌త్యకు ప్రభుత్వం బాధ్య‌త వ‌హించాలి : హ‌రిప్ర‌సాద్‌

నిరుద్యోగి ఆత్మ‌హ‌త్యకు ప్రభుత్వం బాధ్య‌త వ‌హించాలి : హ‌రిప్ర‌సాద్‌

హైదరాబాద్, వార్తానిధి: మంచిర్యాల జిల్లాలో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న నేప‌థ్యంలో మేడ్చ‌ల్ జిల్లా బిజెవైఎం ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. బిజెవైఎం రాష్ట్ర అధ్య‌క్షుడు భానుప్ర‌కాశ్‌, మేడ్చ‌ల్ జిల్లా అధ్య‌క్షుడు చ‌ల్లా ప్ర‌భాక‌ర్‌ పిలుపు మేర‌కు ఫ‌తేన‌గ‌ర్ డివిజ‌నులో ప్ర‌భుత్వ దిష్టి బొమ్మ‌ను అర్బ‌న్ జిల్లా అధికార ప్ర‌తినిధి జి.హ‌రిప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం ద‌హ‌నం చేశారు.

ఈ సంద‌ర్భంగా హ‌రిప్ర‌సాద్‌ మాట్లాడుతూ.. 7 సంవ‌త్స‌రాల‌లో ప్ర‌భుత్వ ఉద్యోగ నోటిఫికేష‌న్లు విడుద‌ల కాలేద‌న్నారు. నిరుద్యోగులు, యువత ఉద్యోగాల కోసం క‌ళ్ల‌ల్లో దీపాలు వేసుకొని ఎదురు చూస్తున్నార‌ని చెప్పారు. కేవ‌లం పోలీసు ఉద్యోగాల భ‌ర్తీని మాత్ర‌మే రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తోంద‌న్నారు.

ఇత‌ర ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు వేసినా.. కోర్టు కేసుల కార‌ణంగా వాటి భ‌ర్తీ జ‌ర‌గ‌కుండా పోతోంద‌ని ఆరోపించారు. అస‌లు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఉందా లేదా అనే అనుమానాలు వ్య‌క్తం చేశారు. టిఆర్ఎస్ ప్ర‌భుత్వం చెప్పే బంగారు తెలంగాణ‌లో నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గ‌త కొద్ది రోజుల క్రితం మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మ‌హేశ్ అనే నిరుద్యోగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విష‌యం బాధాక‌ర‌మ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌ను విడుద‌ల చేయ‌ని కార‌ణంగానే తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాన‌ని సూసైడ్ నోట్‌లో మ‌హేశ్ రాశార‌న్నారు. అత‌ని మ‌ర‌ణానికి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. మ‌హేశ్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాల‌ని కోరారు.

ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌డ‌మే కాకుండా.. భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించాల‌ని సూచించారు. త‌ద్వారా నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌లు జ‌గ‌ర‌కుండా చూడాల‌ని హిత‌వు ప‌లికారు. లేదంటే.. రాబోయే రోజుల్లో బిజెవైఎం ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. విద్యార్థులు, యువ‌త‌, నిరుద్యోగులకు తాము అండ‌గా నిలుస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సీనియ‌ర్ నాయ‌కులు క‌న్నూరి ర‌వి, మేడ్చ‌ల్ మున్సిపాలిటీ బిజెవైఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంతోష్‌, ఫ‌తేనగ‌ర్ డివిజ‌న్ ఉపాధ్య‌క్షుడు అమ‌న్ సాయినాథ్ గౌడ్, నాయ‌కులు అర్జున్ రాథోడ్‌, చైతన్య ప్ర‌సాద్‌, కార్య‌క‌ర్త‌లు చంద్ర‌, ర‌వి రెడ్డి, సందీప్‌, అవినాష్‌, అగ‌ర్వాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments