Friday, December 3, 2021
Home జీవన శైలి మంచిర్యాల జిల్లాలో గాంధారి ఖిల్లా..

మంచిర్యాల జిల్లాలో గాంధారి ఖిల్లా..

విలేకరి : ప్రణీత్ కుమార్ శర్మ

మంచిర్యాల జిల్లా, వార్తానిధి: మంచిర్యాల – మందమర్రి రహదారిలోని అద్భుతమైన ప్రకృతి సౌంద‌ర్యాల న‌డుమ‌ గాంధారి ఖిల్లాను అప్ప‌టి రాజులు నిర్మించారు. జాతీయ రహదారి నుంచి 12 కిలోమీటర్లు లోనికి వెళితే గాంధారి ఖిల్లాకి చేరుకోవచ్చు.

ఖిల్లా గురించి..
గాంధారి ఖిల్లాకు వంద‌ల సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉంది. ఈ ఖిల్లాను రాజ్ గోండులు నిర్మించారని ప్రతీతి. ఇది మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం, బొక్కలగుట్ట, తిమ్మాపూర్ గ్రామం నుంచి పాలవాగు దాటగానే ఉంటుంది.
ఈ ఖిల్లాలో గల మైసమ్మని గిరిజనులు ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ప్రతీ సంవత్సరం ఇక్క‌డ‌ జాతర జరుపుతారు. జాత‌ర‌లో దున్నపోతును బలి ఇవ్వడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం.

అలాగే ఇక్కడ నాయకపోడ్ గిరిజనులు ప్ర‌తి రెండు సంవత్సరాలకి ఒకసారి ఘనంగా ఉత్సవాలు చేస్తారు. ఇక్కడ గిరిజన ఆచారాలు, సంప్రదాయాలు ప్రతిబింబించే శిలారూపాలు, శిల్పాలు మ‌న‌కు ఎన్నో కనిపిస్తాయి.

ఖిల్లా చివరిభాగంలో పైకి ఎక్కడం కోసం కొండకు చెక్కిన మెట్లు ఉంటాయి. ఈ మెట్లు ఎక్కిన తరువాత అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదించవచ్చు.

ఖిల్లాలో దేవాలయం, రెండు శిథిలమైన సొరంగాలు, కొండ‌పై హనుమంతుడు, నాట్యమండపం, నాగు పాము, ఏనుగు, కాలభైరవుని రూపాలు చెక్కి ఉన్నాయి.
కొండపై చాల పాము పుట్టలు కనిపిస్థాయి.

ఖిల్లా ఆవ‌ర‌ణ‌లో మూడు మంచినీటి కొలనులు ఉన్నాయి. ఈ కొలనుల్లో పూర్వం ఏనుగులు నీరు తాగుతూ ఉండేవని, ఈ బావులు ఎప్పటికి ఎండిపోవని స్థానికులు చెబుతుంటారు.

ఈ బావులని సవితి బావులని కూడా పిలుస్తారు. ఈ నీటి మడుగుల‌ ముందు ఒక పెద్ద ఊర చెరువు ఉంది. దీని కింద వందల ఎకరాలు వ్యవసాయం చేస్తుండేవారని తిమ్మాపూర్ గ్రామస్తులు చెబుతారు.

కాసిపేట మండలం, కొత్తఘడ్ కి చెందిన రెడ్డ గోండులు ఇక్కడ పూజారులుగా వ్య‌వ‌హ‌రిస్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖిల్లా నిర్వ‌హ‌ణ నిర్ల‌క్ష్యానికి గురైంది. స్వ‌రాష్ట్రంలో కూడా ప‌ర్యాట‌క అభివృద్ధికి ఈ ప్రాంతం నోచుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక్క‌డి విలువైన కళాసంపదానిని కాపాడుకునేందుకు పురావ‌స్తు శాఖ‌తో పాటు ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.
అయితే ప్రజలు మాత్రం విహారయాత్రలకు, మైసమ్మ తల్లి దర్శనానికి త‌ర‌చూ గాంధారి ఖిల్లాకు వస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments