Saturday, January 22, 2022
Home రాజ్యం దేశంలో విదేశి గూఢచారులు..!

దేశంలో విదేశి గూఢచారులు..!

ఏదైనా దేశం అభివృద్ధి చెందాలంటే జాతీయవాదులైన పౌరులు దేశమంతటా నిండి ఉండాలి. ఉదాహరణకు జపాన్, సింగపూర్ దేశాలను చెప్పుకోవచ్చు. అంటే అక్కడి ప్రభుత్వం తమ పౌరుల్లో దేశం పట్ల అభిమానాన్ని పెంచే విధంగా పరిసరాలను పెంపొందించుకున్నాయి. భారతదేశంలో కూడా జాతీయవాదులకు కొదవ లేదు. కాకపోతే మన దేశంలో జాతీయవాదాలతో పాటు స్వేచ్ఛావాదులు, లౌకికవాదులు అదనంగా ఉంటారు.

జాతీయవాదులు జాతి సంక్షేమాన్ని, దేశ అభ్యున్నతిని కాంక్షిస్తుంటారు. అదే మరోవైపు స్వేచ్ఛావాదులు, లౌకికవాదులు విదేశీ విధానాలు, ఆయా దేశాలను కొనియాడుతూ ఉంటారు. మన దేశంలో అద్భుతం జరిగినా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తారు. విదేశీయులు రాగి పాత్రల్లో నీరు తాగడంపై కోట్ల రూపాయలు వెచ్చించి పరిశోధనలు చేసి.. అలా నీరు తాగడం ఆరోగ్యకరమని చెబితే ఇక్కడ వారు జబ్బలు చరచుకుంటారు. దేశీయ సంస్కృతిని పరిరక్షించాలని జాతీయవాదులు అంటే.. అదంతా కాదు విదేశీ సంస్కృతి గొప్పదని చంకలెగరేస్తారు. ఇలా ఒకటి రెండూ కాదు దేశ అభ్యున్నతికి, సంప్రదాయ పరిరక్షణకు, ప్రజా సంక్షేమానికి దోహదపడే ప్రతి అంశాన్ని వ్యతిరేకిస్తుంటారు.

స్వేచ్ఛావాదుల పేరిట సమానత్వం అంటూ కుల సంఘాలను ప్రోత్సహిస్తారు. కులాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి ఒకే వారిని కూడా పగవారిగా చేయగలిగే సమర్థులు. మిషనరీలు, సైన్స్ సంఘాలు, కమ్యూనిటీ, మావోవాద భావజాలం కలిగిన వీరంతా ఒకే కోవకు చెందినవారని చెప్పుకోవచ్చు. కాకపోతే వారు హింస చేస్తే ప్రజాస్వామ్య విజయం. ఎదుటి వారు ఆత్మరక్షణ కోసం పోరాడితే మానవ హక్కుల ఉల్లంఘన అంటారు.

ఇక లౌకికవాదుల విషయానికి వస్తే మత చాందస వాద సంస్థలు తమ మత ప్రచారం చేసుకుంటే తప్పుకాదని అంటారు. వారు మత మార్పిడిలు చేస్తే సమర్థిస్తారు. అదే దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ అనగానే అదొక మతోన్మాదం అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇలా దేశానికి కొరకరాని కొయ్యగా మారి విభజన వాదాన్ని, ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడమే తమ పని అన్నట్లుగా వ్యవహరిస్తుంటారనేది జగమెరిగిన సత్యం.

మరి వారిని ఎందుకు నిలువరించలేము అనేది ప్రజలే ఆలోచించుకోవాలి. విచక్షణతో విషయాన్ని పరిశీలించాలి. హడావుడి ఆర్భాటాలకు, నాటకాలకు మోసపోవద్దు. వాస్తవాన్ని గ్రహించే యత్నం చేయాలి. వారి సిద్ధాంతాన్ని బహిష్కరించాలి. రాజ్యాంగం చెప్పిన పరస్పర గౌరవంతో మెలిగే వారినే సమర్థించాలి. మరి వారిని సమర్థించే వారిలో ఎవరున్నారు అంటే.. రెండు పేర్లతో అర్థం చేసుకోవచ్చు. శాఖలు ఎన్ని అయినా విదేశి విత్తనాల నుంచి వచ్చిన మొక్కలే చెట్లుగా మారి నేడు మహా విష వృక్షంగా రూపుదాల్చాయి. అవేమిటో మనం అర్థం చేసుకోవడానికి చాలా లోతుగా వెళ్లాలి. ఇక్కడ రెండు పార్టీలు, వాటి శాఖల గురించి చిన్నగా చెబుతాను. మిగిలినది చర్చించుకోదగిన అంశంగా నిలుస్తుంది.

మన దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం విస్తరించిన పార్టీలు రెండే ఉన్నాయి. వాటిలో ఒకటి కాంగ్రెస్ అయితే.. రెండోది కమ్యూనిస్టు పార్టీ. నేడు రాజకీయంగా అధికారం లేకపోయినప్పటికీ విస్తారమైన నెట్వర్క్ ఈ పార్టీల సొంతం. కాంగ్రెస్ పార్టీని 1885 లో బ్రిటీషరు అయిన ఏఓ హ్యుమ్ నాయకత్వంలో మితవాదులు స్థాపించారు. మితవాదులు అంటే అహింసా మార్గంలో, బ్రిటీషర్లతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేవారు అన్నమాట. ఇక కమ్యూనిజం అనేది రష్యా నుంచి చైనా నుంచి దిగుమతి చేసుకున్నది. భారతీయులైన ఎం.ఎన్.రాయ్ వంటి వారి నాయకత్వంలో ప్రారంభమైంది. దేశమంతటా విస్తరించిన అనంతరం భావజాల మార్పు చెంది కమ్యూనిస్టు పార్టీగా మిగిలింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన వారు వేరు కుంపట్లుగా ప్రాంతీయ పార్టీలు పెట్టారు. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టారు, రెచ్చగొడుతున్నారు కూడా. అంతేకాకుండా ఆయా కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల నేతలే బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్యత, న్యాయబద్ధమైన హక్కుల సాధన పేరుతో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి సంఘాలను నిర్వహిస్తున్నారు. ప్రజలను.. ముఖ్యంగా మెజారిటీ ప్రజలను కులాలపరంగా విడదీస్తూ, మైనారిటీలను లౌకికవాదం పేరిట ఏకం చేస్తున్నారు. అలా తమ బ్రిటీషు వారసత్వ విధానమైన విభజించు పాలించును కాపాడుకుంటున్నారు కాబోలు.

ఇక కమ్యూనిస్టులు పార్టీ పరంగానే కాకుండా గిరిజన హక్కులు, బడుగు, బలహీన, కార్మిక, కర్షక, యువత, విద్యార్థి, వికలాంగుల హక్కుల పేరిట అవకాశం ఉన్న ప్రతిచోట సంఘాలను స్థాపించుకున్నారు. పోరాటాలు చేస్తూనే ఉంటారు గాని.. వాటి వలన సాధించిందేమిటో చెప్పరో. అలా దేశంలోని గిరిజన కోనల వరకు పాతుకుపోయారు.

వారిని నడిపించేది ఎవరు.. వారి లక్ష్యాలు ఏమిటనేది వారి మాటలు.. వారి చేతలు.. వారు సమర్తించే వ్యక్తులు.. వారిని సమర్థించే వ్యక్తులే వ్యక్తపరుస్తాయి. వారంతా దేశీ కర్మవీరులో.. విదేశీ గూఢచారులో వారి సైద్ధాంతిక, విధానపరమైన అంశాలే మనకు స్పష్టం చేస్తాయి.

1 COMMENT

  1. వాస్తవికతకు అద్దం పట్టేలా గూడాచారులకు గుబులు పట్టేలా రాసారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments